Monday, 16 November 2015

                                                                అమ్మ

  అమ్మ  ఒక  అందమైన పదం  నాకు నచ్చిన పదం . దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మని మనకి ఇచ్చాడని నమ్ముతాను నేను .  మా అమ్మ అందరిలాంటి అమ్మ కాదు నాకు తెలుసు  ఆ రోజుల్లోనే తను చాల చదువుకుంది అందరు చెప్పేవారు మీ అమ్మగారు చాల ఎక్కువ చదువుకున్నారు అని. అమ్మ చెయ్యి పట్టుకోకుండా   నేను బయటికి వెళ్ళేవాణ్ణి కాదు.. తనతో కలిసి నడుస్తుంటే నాకు గర్వంగా వుండేది .
 నాన్న గారితో కూడా కలిసి ఉండలేనంత చనువు అమ్మదగ్గరే నాకైతే .. అందరు అమ్మ కూచి అని ఏడిపించేవారు. అయినా నాకు లెక్క ఉండేది కాదు. చివరకు స్కూల్ కి వెళ్ళాలన్న అమ్మ వుండాలి. కన్నా నేను రాకూడదమ్మా అని అమ్మ చెప్తే స్కూల్ మానేసేవాణ్ణి . తనకి నేనంటే ప్రాణం .  నాకు ముఖం కడగడం దగ్గరనుంచి అన్నం తినిపించి స్కూల్ కి పంపించేవరకు నా తోనే ఉండేది అమ్మ. నేను అందంగా కనిపించేదాకా నాకు తలదువ్వి అందమైన బట్టలు తొడిగి స్కూల్ కి పంపేది .
         నేను 6వ తరగతి చదువుతుండగా అమ్మ ఆరోగ్యం పాడయింది . నాన్నగారు అమ్మని తీసుకొని వెళ్ళని హాస్పిటల్స్ లేవు . ఇల్లంతా నిశ్శబ్దం గా ఉండేది . మరి డాక్టర్లు ఏం చెప్పారో నాకైతే తెలీదు.. అమ్మ నా చెయ్యి పట్టుకొని స్కూల్ కి వచ్చేదికాదు .  నేను నిశ్శబ్దంగా స్కూల్ కి వెళ్ళేవాడిని .. కొన్ని రోజులకి నాన్నగారు చెప్పారు.. నాన్నా! బాగా చదువుకోవాలి నువ్వు. నేను స్కూల్ కి వెళ్లి సాయంత్రం వచ్చేవరకు అమ్మని నీ బిడ్డలా చూసుకోవాలి సరేనా? అని. నాకు అమ్మ బిడ్డ అంటే నవ్వొచ్చెది. స్కూల్ ఇంటికి పక్కనే ఉండడంతో నాన్నగారికి ఆ వూళ్ళో మంచి పేరు  ఉండడంతో స్కూల్ లో ఎప్పుడు కావాలంటే అప్పుడు పర్మిషన్ ఇచ్చేవారు .
 అమ్మకి  నేనే ముఖం కడిగించడం చేసేవాణ్ణి . నాన్న స్నానం చేయించేవారు అన్నం తినిపించి టాబ్లెట్స్ వేసేసి స్కూల్ కి వెళ్ళేవాడిని మళ్ళి మధ్యలో వచ్చి చూస్కొని వెళ్ళే వాడిని .
అమ్మకి సేవ చేస్తుంటే నాన్నగారిలో బాధకనిపించేది కాదు . అలా నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి.  నేను పదవతరగతిలో ఉన్నాను . శివరాత్రి రోజున నాన్నగారు స్కూల్ కి వెళ్ళారు . స్కూల్ లో సిలబస్ అవ్వడంలేదు పిల్లలు ఇబ్బంది పడుతున్నారని నాతో అన్నారు నేను ఎగ్జామ్స్ కోసం చదువుకుంటున్నాను .. కన్నా! అమ్మ పిలిచింది.  అబ్బా!  అమ్మ ఇలా పిలిచి చాలరోజులయ్యింది కదా ! అని సంతోషంగా ఏం కావాలమ్మా అని అడిగాను
కన్నా! బాగా చదువుకో నాన్నగారిని ఇబ్బందిపెట్టకేం .  నేను దేవునిదగ్గరకు వెళ్లి నా బాబుని బాగా చూసుకోమని చెప్పి రానా కన్నా! అంది . అమ్మ చెప్పిందిఏది అయినా కరెక్ట్ అని నాకు గుడ్డి నమ్మకం .  అమ్మా! తొందరగా వచ్చేస్తావా?అని అడిగా! అమ్మ నవ్వి కన్నా! ఇలా రామ్మా అని పిలిచి నుదిటిమీద ఆఖరి ముద్దు పెట్టింది .  నాన్న వచ్చి చూసారు. అమ్మ వెళ్లి పోయింది అన్నారు .
          నా అమాయకత్వం నాన్నగారిని మళ్లీ పెళ్లి చేస్కోనివ్వలేదు .  తనే నాకు అమ్మా నాన్నా అయ్యి పెంచారు

No comments:

Post a Comment